91 వ కీర్తన వివరణ – 91 Psalms Explanation In Telugu

Written by biblesamacharam.com

Published on:

91 వ కీర్తన 

91 Psalms Explanation In Telugu

 “మహోన్నతుడు” : విశ్వాసిని అన్ని ప్రమాదాలకు అందనంత పైకెత్త గలవాడు. “సర్వశక్తిమంతుడు” : విశ్వాసిని రక్షించడానికి సంపూర్ణ సామర్ధ్యం గలవాడు. నీవు ఆ మహోన్నతుని చాటున నివసిస్తే, ఆ సర్వ శక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి పొందుతావు. ఈ లోకంలో నీడ వాతావరణ పరిస్తితులను బట్టి ఆధారపడి వుంటుంది. కాని ఆయన ఇచ్చే నీడ అన్నివేళలా నిన్ను వెన్నంటే వుంటుంది. అది నీ జీవితానికి ప్రశాంతత నిస్తుంది. 

 ఆ నీడ చెంతకు నీవెప్పుడు చేరగలవు? ఆయన పర్ణశాలలో ఎప్పుడు అడుగు పెట్టగలవు? ఆయన గుడారంలో ఎప్పుడు ప్రవేశించ గలవు? ఖచ్చితంగా శోధనలు, ఆపదలు వచ్చినప్పుడు మాత్రమే! సమాధానం లేని ప్రశ్నలా? పరిష్కారం లేని సమస్యలా? ఆందోళన చెందొద్దు! ఆయన పర్ణశాల ఇంకెంతోదూరంలో లేదు. ఆయన గుడారం నీ ముందే వుంది. ఆ పర్ణశాలను చేరగానే, నీ కన్నీరు నాట్యముగా మారబోతుంది. నీ దుఖ దినాలు సమాప్తం కాబోతున్నాయి. “ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును.” (కీర్తనలు 27:5) నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. (కీర్తనలు 32:7) నీ శోధనలు, వేదనలు, శ్రమలు, నీ కష్ట సమయాల్లో నీవు దాగియుండే చోటు ఆయనే. 

 కాని ఒక్క విషయం! పాపాన్ని కప్పుకుంటే మాత్రం ఆయన నీడలో దాగి వుండి, సేదదీరే అవకాశం నీకులేదు. కనీసం ఆ పర్ణశాల దరిదాపుల్లోకి కూడా చేరలేవు. ఆయన పర్ణశాలలో నీవుండాలంటే పాపాన్ని విడచి, ప్రభువు పాదాల చెంత చేరు. సుంకరి చేసిన చిన్న ప్రార్థన పర్ణశాల ద్వారాలు వాటంతటవే తెరచుకొనేటట్లు చేస్తుంది. మన నిజజీవితాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం! ఆ చల్లని నీడలో నిత్య విశ్రాంతిని పొందుకుందాం! 

ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి ప్పుచున్నాను. కీర్తనలు 91:2 

  1. ఆయనే మనకు ఆశ్రయము: మనము బలహీనులమయితే, బలవంతులను ఆశ్రయిస్తాం. అనారోగ్యమైతే డాక్టర్ ని ఆశ్రయిస్తాం. ఆర్ధిక ఇబ్బందులు అయితే, ధనవంతులను ఆశ్రయిస్తాం. ఇట్లా ప్రతీ పరిస్థితి యందు ఎవరో ఒకరిని ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఎవరిని ఆశ్రయించినా, అది కొన్ని సందర్భాలకే, కొంత కాలమే పరిమితం. అయితే, మన ప్రతీ పరిస్థితి యందు ప్రతీ సమయమందు, శాస్వతకాలము ఆశ్రయించగలిగేవాడు ఒకడున్నాడు. ఆయన మహోన్నతుడు, సర్వ శక్తిమంతుడు మనకు అన్ని పరిస్తితులయందు “చాలిన దేవుడు” దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు (కీర్తనలు 46:1) నీ శోధన కాలంలో ఆయనే ఒక బలమైన, స్థిరమైన కొండ. దానిలోనికి ప్రవేశించి సురక్షితముగానుండు. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును.(సామెతలు 18:10)
  2. ఆయనే మనకు కోట: ఈ లోకంలో ఏ రాజ్యపు కోటలను అయినా శత్రు సైన్యం చేధించవచ్చు. కాని, ఆయనే మనకు కోటగా వున్నాడు. సాతాను ఎన్ని బాణములు ఎక్కుపెట్టినా, ఆ కోటను చేధించిలోనికి రావడం అసాధ్యం. నీ జీవితంలో సాతాను కోట వెలుపల వుండి వాడు సృష్టించే గందరగోళానికి భీతి చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే నీవు ఆయననే కోటగా కలిగియున్నావు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించు వాడునా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నతదుర్గము, నా దేవుడునేను ఆశ్రయించియున్న నా దుర్గము. (కీర్తనలు 18:2)
  3. ఆయనే మనము నమ్ముకొనతగిన దేవుడు: నీ సమస్యల్లో, నీ శోధన కాలంలో మనుష్యులను నమ్ముకోవద్దు. ఎందుకంటే అనేకసంధర్భాలలో నీ బలహీనతలను, వారి బలముగా మార్చుకొని నిన్ను మరింత బలహీనపరచే అవకాశం ఉంది. సమస్యలు వచ్చినప్పుడు క్రుంగి పోవద్దు. ఎందుకంటే మనము రాజాధి రాజు బిడ్డలం. యువరాజులం. రాజులచేతనైనను నరులచేతనైనను రక్షణ కలుగదు వారిని నమ్ముకొనకుడి. (కీర్తనలు 146:3) నమ్ముకొనదగినవాడు ఒకడున్నాడు. ఆయన నీ నమ్మకాన్ని వమ్ము చెయ్యడు. ఆయనే నీకోసం తన చివరి రక్తపుబొట్టు వరకు కార్చిన నీ ప్రియ రక్షకుడునైన యేసయ్య. నీ శోధన కాలంలో ఆయనచూస్తూ వుండిపోడు. తగిన సమయమందు తప్పక కలుగజేసుకుంటాడు. ఆ కోటను ఆశ్రయించు! నమ్మకంతో ఎదురుచూడు!విజయం నీదే!

 వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును. కీర్తనలు 91:3 వేటగాడు ఉరి వొగ్గడంలో అత్యంత నేర్పుగా వ్యవహరిస్తాడు. పక్షికి అనుమానం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. పరిసరాలలో కలసిపోయే దారాలను ఉపయోగిస్తాడు. నూకలతో పాటు, అవసరం అనుకొంటే బ్రతికివున్న మిడతలను కూడా అందులో వుంచుతాడు. ఆ అందమైన పక్షి ఆహారం కోసంవచ్చి వ్రాలుతుంది. వేటగాడు వికటంగా నవ్వుకొంటూ పరుగెత్తుకొస్తాడు. ఎగిరి పోదాం అనుకున్న ఆ పక్షి ఎక్కడికి ఎగురగలదు? అప్పటికిగాని అర్దంకాదు. తాను ఉచ్చులో చిక్కుకున్నానని. నిర్దాక్షిణ్యంగా కాళ్ళు కట్టేస్తాడు. రెక్కలు విరిచేస్తాడు. దాని ఆర్తనాదాలు వినేదెవరు? పాపం ఆ పక్షి ఇంకేమి చెయ్యగలదు? గడియలు లెక్కపెట్టుకోవడం తప్పు. 

 సాతాను అనే వేటగాడు కూడా ఉరులు పన్నడంలో చాల నేర్పుగా వ్యవహరిస్తాడు. ఏ వయస్సువారికి తగిన ఎరలను ఆ వయస్సువార్కి సిద్ధంచేసి సులభంగా ఉచ్చులోనికిలాగి నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు. వాడి ఉరిలో చిక్కుకోకుండా ఉండాలన్నా, చిక్కుకున్న నీవు విడిపించబడాలన్నా ఒక్కటే శరణ్యం! ఆ మహోన్నతుడును, సర్వోన్నతుడును అయిన, ఆ యేసయ్య పాదాలను ఆశ్రయించగలగడం. మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. (కీర్తనలు 116:8) 

 ఒకవేళ ఆయన గుడారము మాటున నీవుంటే? భయపడాల్సిందేమిలేదు! వాడేమి చెయ్యలేడు. “నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు.” మొరెకై కోసం ఉరికంభం సిద్ధం చేయబడింది. దానిని సిద్దం చేయించిన హామానే ఆ ఉరికంభం ఎక్కాల్సి వచ్చింది. “ఆయన నిన్ను విడిపించే దేవుడు” ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలకు ఏవిధంగా నాశానకరమైన తెగులు రాకుండా వారిని రక్షించాడో! ఆ విధంగా ఆయన నిన్ను రక్షించగలడు. నీవు చేయాల్సిందేల్లా ఆ సర్వశక్తుని నీడను ఆశ్రయించడం, ఆశ్రయిద్దాం! అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! మహోన్నతుని చాటున నివసిస్తే? 

ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది. (కీర్తనలు 91:4) 

 ఒక పర్వతం మీద జరిగిన అగ్ని ప్రమాద పరిశీలనకోసం ఒక బృందం అక్కడకి వెళ్తే, రెక్కలు చాచుకొని, కాలిపోయి, మరణించిన పక్షిరాజును చూచి వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఎందుకిది ఇట్లా చనిపోవాలి? మంటలు వ్యాపిస్తుంటే ఎగిరిపోవచ్చు కదా! అని. ఎందుకో వాళ్లకి అనుమానం వచ్చి ఆ పక్షిని పైకిలేపితే, దాని రెక్కల క్రింద సజీవంగా వున్నా పక్షి పిల్లలు వున్నాయట. అవును! నీకును ఆయన రెక్కల క్రింద అట్లాంటి కాపుదల, భద్రత, క్షేమం వుంది. నిన్ను సంరక్షించడం కోసం ఆయన ఆహుతి అయ్యాడు. “నీవు పొందాల్సిన శిక్షను నీకు బదులుగా ఆయనే అనుభవించాడు.” 

  1. ఆ ప్రేమ…….??? 
  2. అద్వితీయమైనది! 
  3. అపురూపమయినది! 
  4. కొలతలు లేనిది! 
  5. హద్దులు లేనిది! 
  6. అవధులు లేనిది! 
  7. వర్ణింపజాలనిది 
  8. మధురమైనది! 
  9. ‘స్వచ్ఛమైనది! 
  10. శ్రేష్టమైనది! 
  11. సహించేది! 
  12. దయ చూపించేది! 
  13. అసూయలేనిది! 
  14. డంబములేనిది! 
  15. * ఉప్పొంగనిది! 
  16. మర్యాద గలది! 
  17. కోపం లేనిది! 
  18. స్వంత ప్రయోజనం చూడనిది ! 
  19. అన్నిటిని తాలుతుంది! 
  20. అన్నిటిని నమ్ముతుంది! 
  21. అన్నిటిని ఓర్చుకొంటుది! 
  22. అన్నిటిని నిరీక్షిస్తుంది! 
  23. శాస్వతమయినది! 
  24. అది నీ దేవుని ప్రేమ. 

” యెరూషలేముచుట్టు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టు ఉండును.” (కీర్తనలు 125:2) నీవు ఆయనను ఆశ్రయించ గలిగితే ఆయనే నీ చుట్టూ ప్రాకారముగా వుండి, సాతాను విసరుతున్న వాడిగల బాణములను (శోధనలను) ఆయనే కేడేముగా, డాలుగా వుండి, వాటన్నిటినుండి నిన్ను సంరక్షిస్తాడు. ఆయన రెక్కల క్రిందికి రా! ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించు. రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనలు 91:5,6 రాత్రివేళ శత్రుదాడులనుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో, పగలు వచ్చే ప్రమాదాలనుండి తప్పించడంలో కూడా అంతే సమర్ధుడు. “నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను యెహోవా యెహోవాయే నాకు బలము ఆయనే నా కీర్తనకాస్పదము ఆయన నాకు రక్షణాధారమాయెను. (యెషయ 12:2) ఏ పరిస్తితికి నీవు భయపడనవసర్లేదు. 

 ఎందుకంటే నీ రక్షణకు ఆధారం ఆయనే. ఆయనే నీకు బలం. అయితే నీవు చెయ్యవలసింది ఒక్కటే. ఆ మహోన్నతుడును, సర్వశక్తిమంతుడైన దేవునిని నమ్ముకోవడం, ఆయన్ని ఆశ్రయించడం. యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు? (కీర్తనలు 118:6) ఆయన నీపక్షమున వుంటే, నిన్ను ఎవ్వరూ ఏమి చెయ్యలేరు. ఆ ముగ్గురు హెబ్రీ యువకులను అగ్ని ఏమి చెయ్యలేకపోయింది. దానియేలును సింహాలు ఏమి చెయ్యలేకపోయాయి. యోహానును సలసల కాగే నూనె ఏమి చెయ్యలేకపోయింది. కారణం దేవుడు వారి పక్షమున వున్నాడు. 

 శత్రు బాణములు నీకు అందనంత ఎత్తులోనుండి దూసుకువస్తున్న భయపడనవసరంలేదు. నీవు ఆ సర్వశక్తుని నీడను విశ్రమించి యున్నట్లయితే? ఆ మహోన్నతుని చాటున నీవున్నట్లయితే ప్రతీ పరిస్తితి నీముందు మోకరిల్లుతుంది. భయపడవద్దు. భయపడితే వాడు ఇంకా భయపెడతాడు. భయం వేస్తె నీకోసం ఘోరమరణం అనుభవించిన యేసయ్యను తలంచుకో. అప్పుడు భయానికే భయమేస్తుంది. భయపడవద్దు అని పరిశుద్ధ గ్రంధములో 366 సార్లు వ్రాసిపెట్టాడట. అంటే లీపు సంవత్సరంలో వున్న ఆ రోజును కూడా కలుపుకొని రోజుకోక్కసారి చొప్పున ప్రతీదినము ఆ వాగ్ధానమును దేవుడు మనకు ఇస్తున్నాడు. ఆయన నీకు తోడుగా వున్నాడు ధైర్యంతో సాగిపో! ఆగిపోవద్దు! పరిస్తితులకు భయపడకు! ఆయనకు మాత్రం భయపడు! 

 నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కీర్తనలు 91:7,8 మహోన్నతుని చాటున నివసించేవాడు, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు నాశనం కావడం అసాద్యం. 

 అతడు జీవించి వుండాలని దేవుని సంకల్పం అయినంతకాలం అతడు మరణించలేడు. దేవుడు విశ్వాసి మేలుకోసం నిర్ణయించినది తప్ప మరేది అతన్ని తాకదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. ఈ జీవితకాలంలో కాకపోయినా దేవుడు లోకానికి అంతిమ తీర్పు తీర్చే సమయంలోనైన విశ్వాసి దీన్ని చూస్తాడు. ఆసాపు వలే నీవిట్లా అనుకోవచ్చు. భక్తి హీనులు క్షేమంగా వున్నారు. వారికి బాధలు లేవు. రోగాలు లేవు. బలాత్కారం చేస్తున్నారు యెగతాళి చేస్తున్నారు గర్వముగా మాట్లాడుతున్నారు ధనం సంపాదిస్తున్నారు దేవుడంటే అసలు లెక్కేలేదు. అయినా?… వారే వర్ధిల్లుతున్నారు వారే సంతోషంగా వుంటున్నారు. నేను పవిత్రంగా జీవించడం వల్ల నాకొచ్చిన ప్రయోజనం ఏమిటి? శోధనలు, వేదనలు, శ్రమలు తప్ప? 

 అయితే ఒక్క విషయం! ఈ దినాన్న క్షేమంగా వున్నా, భక్తిహీనులు ఒక దినాన్న క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు. ఆ సర్వశక్తుని నీడను ఆశ్రయించిన నీవు అయితే … ఎల్లప్పుడు ఆయనతోనే ఉంటావు. ఆయనే నీ చెయ్యి పట్టుకుంటాడు. నిన్ను నడిపిస్తాడు. ఎక్కడివరకు? 

ఆయన మహిమలో చేరేవరకు. అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

మహోన్నతుని చాటున నివసిస్తే?

యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు. కీర్తనలు 91:9 

 మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో తిరుగుతూ, గుడారాల్లో నివసిస్తూ వున్నారు. యాత్రికులు, పరదేశులు వలే ఒక దేశం నుండి మరొక దేశానికి అనగా వాగ్దాన భూమికి పయనం సాగిస్తున్నారు. దానిలో భాగంగా అల్పకాల విశ్రాంతి కొరకు గుడారాలు ఏర్పాటు చేసుకొని వాటిలో జీవనం సాగిస్తున్నారు. అయితే వారికి స్థిరమైన నివాస స్థలం ఒకటి వుంది. అది “యోహావాయే” అందుకే మోషే అంటున్నాడు. ప్రభువా, తరతరములనుండి మాకు నివాసస్థలము నీవే. (కీర్తనలు 90:1) మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. (కొలస్సి 3:3) 

 నీవునూ ఆ మహోన్నతుడునూ, సర్వోన్నతుడునూ అయిన దేవుని నివాస స్థలముగా చేసుకోవాలి. దేవుడే మన నివాసం అయినప్పుడు, ధనికుల యొక్క భవనాలు చూసి అసూయ చెందవలసిన పనిలేదు. ఎందుకంటే, కోట్లు కుమ్మరించి కట్టినా అవి ఒక దినాన్న నేలకూలి దుమ్ములో కలసిపోవలసిందే. అదే, నీ సజీవమైన దేవుడే నీకు నివాస స్థలం అయితే నీ నివాసం శాశ్వత కాలంనుండి శాశ్వత కాలం వరకు నిలెచే వుంటుంది. అయితే, విచారం ఏమిటంటే ఈ శాశ్వతమైన నిత్యనివాసం గురించిన తలంపే మనకులేదు. ఈ క్షణాన్న దానికోసం ఎందుకు ఒకసారి ఆలోచించ కూడదు? ఎందుకు ప్రయత్నించ కూడదు? పక్కాభవనం అని గర్వించొద్దు! పూరి గుడిసె అని దిగులొద్దు! కావేవి మనకు శాశ్వతం! తరతరాలకు మన నివాస స్థలం “నీకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించిన నీ ప్రియ రక్షకుడయిన ఆ యేసయ్యే! ఆయననే ఆశ్రయిద్దాం! ఆశీర్వాదించ బడదాం! నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. కీర్తనలు 91:10 

గుడారం: శారీరకంగా మనం నివసించే “ఇల్లు.” ఆత్మీయంగా మన “దేహం.” అంటే నీ ఇంటి మీదికిగాని, నీ ఒంటిమీదికిగాని ఏ అపాయంగాని, తెగులుగాని సమీపించదు. అదేంటి? మన ఇంట్లోను సమస్యలే. 

ఒంట్లోను సమస్యలే కదా? అంటే ఎక్కడో ఈ వాక్యంలోనే తప్పుంది. ముమ్మాటికి లేదు. అది నీలోనే వుంది. 

 ఎందుకలా? నీవు ఆ మహోన్నతుని చాటున నివసించడం లేదేమో? ఆ సర్వశక్తుని నీడను విశ్రమించడం లేదేమో? యేసయ్య కాకుండా నీకంటూ ఒక చాటు, నీడ వున్నాయేమో? ఆ చాటులో పాపం చేస్తూ, ఆ నీడలో విశ్రమిస్తున్నావేమో? అవునా? ఇదే వాస్తవం అయితే ఎందుకు సరిచేసుకోకూడదు? లేదు. నేను ఆయన చాటునే దాగియున్నాను. ఆ నీడే నాకు విశ్రమ స్థానం. అంటున్నావా? అయితే, భయం లేదు. “నీకు అపాయమేమియు రాదు” ఒకవేళ అపాయం వచ్చినా, ఉపాయం నీకుంది. ఈ వాగ్దానాలు నీ స్వంతం. “ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును.” (కీర్తనలు 121:7) యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువులు యిచ్చకు నీవు వానిని అప్పగింపవు. (కీర్తనలు 41:2) నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును. (సామెతలు 1: 33) అవును! ఆయన చాటున దాగివుందాం! ఆయన నీడన విశ్రమిద్దాం! 

 నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొందురు. కీర్తనలు 91:11,12 

 నీ మార్గములు ఎట్లాంటివి? నీకు నీవే, నీకోసం స్వంతగా ఎన్నుకున్న మార్గములా? అయితే, ఖచ్చితంగా ఈ వాగ్దానం నీకొరకు కాదు. ఆ మహోన్నతుని ఆశ్రయించి ఆయన మార్గములలో నీవు సాగిపోతున్నవా? ఖచ్చితంగా ఈ వాగ్దానం నీకోసమే! ఆయన నీకు తోడుగా “దూతను”కాదు. “దూతలను” పంపుతాడట. ఒక్క దూత ఒక్కరాత్రిలో ఒక లక్షఎనుబది ఐదు వేల మందిని చంపేసాడు. అంతటి శక్తివంతమైన దూతలను ఆయన నీకు తోడుగా పంపుతున్నాడు. సాతాను ఎంతటి వాడిగల బాణములను నీపైకి విసిరినా, అవేమి చెయ్యలేవు. కాపాడే దూతలు నీవెంటే వున్నారు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తే అవి మరెందుకు మన మార్గములను సరాళం చెయ్యడం లేదు? ఎటు చూసినా! ముండ్లపొదలు, గచ్చపొదలు, రాళ్ళు, రప్పలతోనే (శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులతో మన మార్గములు నిండి వుంటున్నాయి? 

 ఆ దూతలు నీవెంటే వుండి, నీవు వేసే ప్రతీ అడుగుకు వున్న అడ్డుబండలను తొలగిస్తాయి. నీవు నడవలేని పరిస్తితులు అక్కడ వుంటే అవి వాటి భుజాలపైన నిన్ను మోస్తాయితప్ప, నీకోసం సిమెంటు రోడ్లు సిద్దపరచవు. అట్లా చేస్తే ఇక నీకు దేవునితో పనేముంది? అంటే నీవు వేసే ప్రతీ అడుగులోనూ ఆ మహోన్నతుడును, సర్వోన్నతుడును, సర్వశక్తుడును అయిన ఆయనను ఆశ్రయించగలగాలి. అప్పుడు మాత్రమే ఈ వాగ్దానమును నీ జీవితములో అనుభవించ గలవు. యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును. (కీర్తనలు 34:7) నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి, సింహములు నాకు ఏహానియు చేయకుండ వాటి నోళ్లు మూయించెను. (దానియేలు 6:22) ఆయన్నే ఆశ్రయిద్దాం! ఆయనయందే భయ భక్తులు నిలుపుదాం! ఆయన దృష్టికి నిర్దోషులుగా జీవిద్దాం! ఆయనిచ్చు ఆశీర్వాదాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! 

మహోన్నతుని చాటున నివసిస్తే ? 

నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. కీర్తనలు 91:13 

సింహము, నాగుపాము సాతానును గుర్తుకు తెస్తున్నాయి. సాతాను అత్యంత శక్తివంతమయినది. (దేవునికంటే మాత్రం కాదు) ఎంతటి శక్తిగలది అంటే, దేవుని పరిశుద్ద రక్తాన్ని సహితం బలిగా తీసుకోగలిగింది. అంతటి శక్తిగలిగిన సాతానును సహితం కాలితో త్రోక్కేసే శక్తిని దేవుడు నీకిచ్చాడు. ఇదెప్పుడు సాధ్యం? “ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించినప్పుడు. గర్జించు సింహం: మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. (1 పేతురు 5:8) 

సర్పము( పాము): దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతు వులలో సర్పము యుక్తిగలదై యుండెను (ఆదికాండము 3:1) సాతాను సింహము వలే గర్జిస్తూ, పాము వలే యుక్తిగలిగి, ఏనుగు వలే బలము గల… నమిలితే ఆలస్యమవుతుంది అన్నట్లుగా, దొరికినవారిని దొరికినట్లు మింగేస్తున్నాడు. మన బలహీనతలు పసిగట్టి సరయిన సమయంలో పంజా విసరుతున్నాడు. ఎంతమందిని మింగినా వాడి ఆకలికి అంతులేదు. సంతృప్తికి అర్ధమే తెలియదు. ఇంటర్ నెట్ లో ” క్లిక్ మి” అంటూ వాడి రాజ్యంలోనికి తీసుకెళతాడు. దానిలోనుండి బయటకు రాలేక నిద్రలేని రాత్రులు గడుపుతున్న వారు కోకొల్లలు. ఫేస్ బుక్ తో నీ ఫేస్ వేల్యూ పెంచుతా అని చెప్పి, అడ్డంగా “బుక్” చేసేస్తున్నాడు. తమ పోస్టింగ్స్ కి లైక్ లు లేవని, కామెంట్స్ లేవని అల్లాడిపోయేవారు ఎందరో…. (ఫేస్ బుక్ ఉపయోగించుట తప్పు అనికాదు. బానిస మాత్రం కావద్దని) ఇట్లా అనేక మార్గాలలో ఎందరినో బానిసలుగా మార్చేశాడు. యుక్తితో, కుయుక్తితో వాడిరాజ్యాన్ని విస్తరింపచేస్తున్నాడు. రాజైన దావీదు 

 మొదలుకొని గేహజి వరకు అందరూ వీడికి బానిసలే. ఇట్లాంటి వాడిని జయించేది ఎట్లా? దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీయొద్దనుండి పారిపోవును. (యాకోబు 4:7) ఆ మహోన్నతుని ఆశ్రయిద్దాం! ఆయనకు లోబడి ఉందాం! ఆయనిచ్చే శక్తితో సాతాన్ని ఎదిరిద్దాం! వాడిపైన విజయం సాదిద్దాం! అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. కీర్తనలు 91:14 

నీవు దేవుని ప్రేమిస్తే? ఆయన నిన్ను తప్పిస్తాడు, ఘనపరుస్తాడు. ఆయన ముందుగానే నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమకు నీవు ప్రతిస్పందిస్తే చాలు. 

 ఇంతకి ఏమి చేసాడాయన? సుమారుగా రెండువేల సంవత్సరాల క్రితం “నీకు బదులుగా” యెరుషలేము వీధుల్లో, మండుటెండలో వీపు మీద భారమయిన సిలువను మోసాడు. 39 కొరడా దెబ్బలతో ఆయన శరీరమంతా నాగటి చాళ్ళవలే దున్నబడింది. ఆయన ముఖమంతా పిడిగుద్దులతో వాచిపోయింది. ఉమ్ములతో నిండిపోయింది. ముండ్ల కిరీటం నుండి కారుతున్న రక్తంతో ముఖమంతా రక్తసిక్తమయ్యింది. మూడు మేకులతో భూమికి, ఆకాశమునకు మధ్యన ఆ కల్వరిగిరిలో వ్రేలాడుతున్న పరిస్థితి. చివరి రక్తపుబొట్టు వరకు ఏరులై ప్రవహించిన అనుభవం. అది వర్ణనకు అందని అద్భుత త్యాగం. ఇదెవరికి సాధ్యం? అంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. నీవు ఆయనను ప్రేమించాలంటే, ఆయనలానే నీవూ చెయ్యలా? అవసరంలేదు. అది నీకు సాధ్యం కాదు కూడా! 

 ఆయనను ఎట్లా ప్రేమించాలి? మనమాయన ఆజ్ఞలప్రకారము నడుచుటయే ప్రేమ (2 యోహాను 1:6) ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవగలిగితే ఆయనను ప్రేమించినట్లే. ఆయనను ప్రేమిస్తే? అయన నిన్ను తప్పిస్తాడు. హెబ్రీయువకులను అగ్నిగుండంనుండి, దానియేలును సింహపుబోనులో నుండి తప్పించినట్లు. ఆయన నిన్ను ఘనపరుస్తాడు: బానిసగా బ్రతకాల్సిన యోసేపును ప్రధానిని చేసినట్లు. ద్వారమందు కూర్చునే మొద్ధెకైను రాజసన్నిధిలో కూర్చుండబెట్టినట్లు. ఎందుకు వీరంతా తప్పించబడ్డారు? ఘనపరచబడ్డారు? ఆయనను ప్రేమించారు గనుక. మనమునూ ఆయన ప్రేమకు ప్రతిస్పందిద్దాం! తప్పించబడదాం! ఆయన చేత ఘనపరచబడదాం! 

అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనలు 91:15,16 నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రియ రక్షకుడయిన, ఆ మహోన్నతుని చాటున నివసిస్తూ, ఆ సర్వశక్తుని నీడను విశ్రమించ గలిగితే? దివ్యమైన, శాశ్వతమైన ఆశీర్వాదాలు

నీ స్వంతం: 

 నీ ప్రార్ధనకు సమాధానం: నీ ప్రార్ధన వింటాడు. నీ కోరిక సిద్ధింప చేస్తాడు. నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. నీ శ్రమలలో నీతోపాటే ఉంటాడు. శ్రమలలో ఆయన నీతోవుంటే అవి శ్రమలే కాదు. సంతోషంలో ఆయన నీతోలేకుంటే అది సంతోషమే కాదు. నీ జీవిత నౌక యొక్క చుక్కానిని ఆయనకీ అప్పగిస్తే సుడిగుండాలలో ఎట్లా నడిపించాలో? ఎగసిపడే అలల మధ్య ఎట్లా నడిపించాలో? నిర్మలమైన నీటిలో ఎట్లా నడిపించాలో? ఆయన కంటే తెలిసిన వారెవరూలేరు. సమస్యల సుడిగుండాలు నిన్ను వేధిస్తున్నా, వేధన చెందొద్దు. నీ శ్రమల్లో ఆయన నీతోనే ఉంటాడు. గమ్యం చేర్చుతాడు. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని యింట నుండెను. ఆదికాండము 39:2) దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తాడు: ఈలోకంలో ఎంతకాలం జీవించినా అది అల్పకాలమే. తప్పకుండ ఒకరోజు విడచి వెళ్ళాల్సిందే. దీర్ఘాయువు అనే నిత్యజీవాన్నిచ్చి నిన్ను తృప్తి పరుస్తాడు. ఆయన రక్షణ నీకు చూపిస్తాడు: రక్షణ అంటే “శిక్షనుండి తప్పించబడడం.” నిత్య నరకాగ్ని అనే శిక్ష నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. 

ఇవన్ని ఎప్పుడు సాధ్యం?  మారు మనస్సు “పశ్చాత్తాపం “పాప క్షమాపణ నీజీవితంలో తప్పనిసరి. 

ఇక వాయిదా వెయ్యొద్దు. ప్రభు పాదాల చెంత మోకరిల్లుదాం! ఆయనిచ్చే ఆశీర్వాదాలు అనుభవిద్దాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! 

 

 

 

 

 

91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu 91 Psalms Explanation In Telugu


ప్రశ్నలు జవాబుల కొరకు .. click here 

 

 

 

 

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a comment

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO
error: restricted